Sukma | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సిలిగేర్-టేకులగూడెం ప్రాంతంలో మావోయిలు మందుపాతర పేల్చడంతో ఇద్దరు జనాన్లు వీరమరణం పొందారు. సైనికుల కదలికలను గమనించిన మావోయిలు ఐఈడీ పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. ట్రక్కును లక్ష్యంగా చేసుకొని మావోలు ఐఈడీని పేల్చగా.. ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందగా మరో మరికొందరు సైనికులు గాయపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిలిగేర్ నుంచి పూర్వీ వెళ్లే రహదారిపై పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. పేలుడు ధాటికి జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఇందులో ఇద్దరు సైనికులు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మిగతా సైనికులకు చికిత్స అందిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఘటనపై ఏఎస్పీ ఆకాశ్‌రావు వివరాలు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం సుక్మా జిల్లా ఝుగర్గుండ ప్రాంతంలోని క్యాంప్ సిలిగేర్, టేకులగూడెం మధ్య జవానుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని.. ఐఈడీ సహాయంతో పేలుడుకు పాల్పడ్డారని తెలిపారు. వాహనంలో 2021 కోబ్రా బెటాలియన్‌కు చెందిన డ్రైవర్ విష్ణు, కానిస్టేబుల్ శైలేంద్ర వీరమరణం పొందారని తెలిపారు. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో తనిఖీలు కొనసాగుతున్నాయని వివరించారు.