కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 5 : మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ బండి ప్రకాశ్ నేలకొరిగారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు కొనసాగింది. దీంతో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మావోయిస్టు మృతదేహంతోపాటు ఒక ఏకే-47, ఆటోమేటిక్ ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు(సీసీఏం) సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతడిపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. సుధాకర్‌ది ఏపీ రాష్ట్రం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం అని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ పేరుతో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ అధినాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి తరువాత ఆ పార్టీకి చెందిన పెద్ద క్యాడర్‌నే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేసినట్లు సమాచారం.