Maoists | భద్రాద్రి కొత్తగూడెం/ సుబేదారి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ), భోపాల్: ఇటీవల దండకారణ్యంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో బుధవారం ఓ లేఖ విడుదలైంది. భద్రతా దళాలు పథకం ప్రకారం తమ పార్టీకి చెందిన పీఎల్జీ నిరాయుధ సభ్యులను అమానవీయంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాయని అభయ్ లేఖలో ఆరోపించారు. మహిళా కామ్రేడ్స్పై పోలీసులు సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.
400 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలను, కమాండర్లను, ఆదివాసీలను వారు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనన్నారు. అందుకు సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వాలే కల్పించాలని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో వివిధ రాష్ర్టాల్లో చేపట్టిన హత్యా కాండలను వెంటనే నిలిపివేయాలని ఆయన కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరారు. అడవుల్లో సాయుధ బలగాల క్యాంపులను తొలగించి, శాంతి చర్చలకు అంగీకరిస్తే తక్షణమే తాము కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు. శాంతి చర్చలకు మేధావులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థి నేతలు, పర్యావరణ కార్యకర్తలు సహకరించాలని అభయ్ తన లేఖలో కోరారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు సీనియర్ మహిళా నక్సలైట్లు మమత, ప్రమీల మరణించినట్టు మధ్యప్రదేశ్ డీజీపీ కైలాశ్ మక్వానా తెలిపారు. వారిపై చెరో రూ.14 లక్షల రివార్డు ఉన్నదని ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ముండిదాదర్-గనేరిదాదర్-పర్సటోలా అటవీ ప్రాంతంలో పోలీసులు బుధవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు కాల్పులు తీవ్రం చేయడంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.