కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 25: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా, కోసా దాదాలను పోలీసులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని, ఇప్పుడు ఎన్కౌంటర్ పేరుతో కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది.
ఈ నెల 22న నారాయణ్‌పూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణత్యాగం చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా దాదాలతోపాటు అమరులైన కేంద్ర కమిటీ, ఎస్‌జేసీ, డీవీసీ సభ్యులందరికీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
రాజు దాదా, కోసా దాదాల ఎన్కౌంటర్ పూర్తిగా కల్పితమని, దీనిపై పోలీసులు కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. వారిని సెప్టెంబర్ 11-20 తేదీల మధ్య రాయ్‌పూర్ లేదా ఇతర ప్రాంతాల నుంచి నిరాయుధులుగా అరెస్ట్ చేసినట్లు సమాచారం ఉందన్నారు. వాస్తవానికి వారిని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోకుండా.. నకిలీ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారన్నారు. ఈ హత్యాకాండను అందరూ నిరసించాలని విజ్ఞప్తి చేశారు.