చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్సీడీసీ చీఫ్, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, డీబీటీ సెక్రెటరీ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా మూడింటిపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్ఫెక్షన్ పెరుగుదల.. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని మాండవీయ సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ముప్పు పెరుగుతున్నది. ఈ సబ్ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మంగళవారం 24 గంటల్లో 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి 12న చైనాలో అత్యధికంగా 14వేలకుపైగా కేసులు నమోదవగా.. రెండు రోజుల కిందట భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తున్నది. చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికాలో కేసులు కొత్త కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయని వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లో కేసులు ఇప్పటికే ధ్రువీకరించాయి. ఇక్కడ రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.