Manoj Tiwari : ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయడంలో చాలా జాప్యం జరిగిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. గత ఆరు నెలలుగా ఢిల్లీకి సీఎం అంటూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మనోజ్ తివారీ మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్‌కు అహమే పెద్దదిగా కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడు అన్ని దారులూ మూసుకుపోవడంతో గత్యంతరం లేక అతిశీకి అధికారం అప్పగించారని ఆరోపించారు. ఢిల్లీ ప్రజల ముందు తాను నిజాయితీపరుడిగా నిరూపించుకునేందుకు ఈ డ్రామాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
ఆప్ పాలనలో ఢిల్లీ అధోగతి పాలైందని, 15 ఏండ్లుగా ఢిల్లీని కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తే పదేండ్లుగా ఆప్ ఢిల్లీ పరిస్ధితిని మరింత దిగజార్చిందని ఆరోపించారు. నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కోరుకుంటే అందుకు బీజేపీ సిద్ధంగా ఉందని మనోజ్ తివారీ స్పష్టం చేశారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ స్ధానంలో ఢిల్లీ నూతన సీఎంగా అతీశి పాలనా పగ్గాలు చేపట్టనుండటంపై ఆప్ మంత్రి అమన్ అరోరా స్పందించారు. అరోరా మంగళవారం చండీఘఢ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన అనంతరం జవాబుదారీతనంలో కేజ్రీవాల్ ఇవాళ నూతన అధ్యాయాన్ని లిఖించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యున్నతమైనదని, తనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తిరిగి ప్రజల ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆప్‌నకు సీఎం పదవి కంటే విలువలు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన అనంతరం ఆప్‌లో చీలికకు కాషాయ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు.
Read More :
Swaminarayan temple: న్యూయార్క్‌లో స్వామినారాయణ్ ఆలయంపై దాడి