న్యూయార్క్: అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయం(Swaminarayan temple)పై దాడి జరిగింది. ఆ దాడిని న్యూయార్క్‌లోని భారతీయ కౌన్సులేట్ ఖండించింది. ఆ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీసుల్ని కోరినట్లు భారతీయ కౌన్సులేట్ పేర్కొన్నది. మెలివిల్లీలో ఉన్న స్వామినారాయన్ ఆలయాన్ని ధ్వంసం చేయడం ఆమోదించదగ్గ చర్య కాదు అని భారత కౌన్సులేట్ ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయ ప్రజలతో టచ్‌లో ఉన్నామని కౌన్సులేట్ తెలిపింది. లాంగ్ ఐలాండ్‌లోని సఫోలాక్ కౌంటీలో మెలివిల్లీ ఉన్నది. అయితే ఈ ఊరుకు సమీపంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీన భారతీయ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆలయంపై జరిగిన దాడి ఘటన పట్ల విచారణ చేపట్టాలని హిందూ అమెరికా ఫౌండేషన్ పేర్కొన్నది. హిందూ ఆలయంపై దాడి చేయడం అంటే పిరికిపంద చర్యే అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎడిటర్ సుహాగ్ శుక్లా తెలిపారు.
హిందువులు, భారతీయ సంస్థలపై దాడులు చేస్తామని ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది గురుపర్వత్ సింగ్ పన్నూ హెచ్చరికలు చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.