Atishi : ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi) అద్భుతంగా పనిచేస్తారని తాను ఆశిస్తున్నానని, ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నానని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పేర్కొన్నారు. పట్నాలో మంగళవారం మనోజ్ ఝా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఢిల్లీ నూతన సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టనున్న సందర్భంగా అతిశీకి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరతానని రెండ్రోజుల కిందట కేజ్రీవాల్ వెల్లడించారని, కేజ్రీవాల్ బాటలో అతిశీ మెరుగైన సామర్ధ్యం కనబరిచి తన పదవికి న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
కాగా, ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీ (Atishi)ని కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఇవాళ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు.
కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
Read More :
SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని