Congress | న్యూఢిల్లీ/భోపాల్, ఫిబ్రవరి 18: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ ఎంపీ మిలింద్ దేవ్రా వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా ఆ జంపింగ్ లిస్టులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌తోపాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎంపీ మనీశ్ తివారీ పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ లోక్‌సభ నియోజకవవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తివారీ.. బీజేపీతో టచ్‌లో ఉన్నారని, ఆయన లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి బీజేపీతో చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. మనీశ్ తివారీ బీజేపీ టికెట్‌పై లూథియానా స్థానం నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్‌నాథ్‌కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్‌కు చెందిన వీరంతా కమల్‌నాథ్‌తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీరంతా కాంగ్రెస్ అగ్రనేతల ఫోన్లకు స్పందించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకెళ్లేందుకు కమల్‌నాథ్ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మాజీ సీఎం కమల్‌నాథ్ చింధ్వారా స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా చేశారు. ప్రస్తుతం అదే చింధ్వారా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పీసీసీ అధ్యక్షుడిగా తొలగించిన విధానంపై కమల్‌నాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, కమల్‌నాథ్ సన్నిహితుడు దీపక్ సక్సేనా పేర్కొన్నారు. తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకొన్నా, ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. తాను కూడా కమల్‌నాథ్ బాటలోనే పయనిస్తానని మరో మాజీ మంత్రి విక్రమ్ వర్మ ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు వరుసకట్టి బయటకు వెళ్తున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌తో సహా గత పదేండ్లలో ఏకంగా తొమ్మిది మంది మాజీ ముఖ్యమంత్రులు హస్తానికి రాంరాం చెప్పారు. ఈ జాబితాలో అమరిందర్ సింగ్(పంజాబ్), గులాం నబీ ఆజాద్(జమ్ముకశ్మీర్), విజయ్ బహుగుణ(ఉత్తరాఖండ్), అజిత్ జోగి(చత్తీస్‌గఢ్), ఎస్ఎం కృష్ణ(కర్ణాటక), నారాయణ్ రాణే(మహారాష్ట్ర), గిరిధర్ గమాంగ్(ఒడిశా) ఉన్నారు.
అశోక్ చవాన్ గత వారం కాంగ్రెస్‌ను వీడగా.. గత నెల జనవరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు సన్నిహితుడు, మాజీ ఎంపీ మిలింద్ దేవ్రా కూడా బయటకు వెళ్లిపోయారు. పార్టీ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబం తప్పుకొని, ఇతర నేతలకు అవకాశం ఇవ్వాలని 2022లో డిమాండ్ చేసిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్.. తర్వాత రెండు నెలలకే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంకా ఆ పార్టీని వీడిన వారిలో పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్, జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్, ఆర్పీఎన్ సింగ్, అశ్విని కుమార్, హార్దిక్ పటేల్ వంటి నేతలు ఉన్నారు.