కంగ్పొక్పి, మార్చి 10: బీరేన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుకి గిరిజనులు శుక్రవారం చేపట్టిన శాంతి ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. తమ భూమి హక్కులకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ కంగ్పొక్పి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గిరిజనులు శాంతి ర్యాలీలు నిర్వహించారు. పర్వత ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను ఖాళీ చేయాలంటూ అటవీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులను నిరసిస్తూ అడవి బిడ్డలు ఆందోళన చేపట్టారు. అయితే కంగ్పోక్పిలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఆందోళనకారులు వారిపైకి రాళ్లు రువ్వారు.
బీజేపీ రాష్ర్టాల్లో అవినీతి అంతమైపోయిందా?
విపక్షాలపై సీబీఐ, ఈడీ దాడుల తీరును ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఖండించారు. బీజేపీ బలహీనంగా ఉన్న, అధికారంలో లేని రాష్ర్టాలపై దాడులకు ఆ పార్టీ ఆసక్తి చూపుతున్నదని విమర్శించారు. ‘అవినీతి జరిగితే తప్పక చర్యలు తీసుకోవాల్సిందే. బీజేపీయేతర రాష్ర్టాల్లో మాత్రమే ఎందుకు దాడులు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతి అంతమైపోయిందా?’ అని ప్రశ్నించారు.