Rahul Gandhi : కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కారు తీరుపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరువల్ల దేశం సర్వనాశనం అయ్యిందన్నారు. మణిపూర్ (Manipur) గురించి చెప్పాలంటే మణిపూర్‌ను వాళ్లు (బీజేపీ) పూర్తిగా తగులబెట్టారని విమర్శించారు. ఇప్పటికీ మణిపూర్ పాలకులు బీజేపీని తగులబెడుతూనే ఉన్నారని మండిపడ్డారు.
మణిపూర్‌లో రోజుల తరబడి హింస చెలరేగినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కనీసం దేశ ప్రధాన మంత్రి కూడా మణిపూర్‌ను సందర్శించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్న ప్రధాని మణిపూర్‌కు వెళ్లడం లేదంటే.. మణిపూర్ అంత దుస్థితిలో మరో రాష్ట్రం లేదని బీజేపీ ఒప్పుకున్నట్లేనని రాహుల్ అన్నారు.
బీజేపీ వ్యవహారశైలివల్లే మణిపూర్ కొన్ని నెలలపాటు నిప్పుల కొలిమిలా రగిలిపోయిందని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిమ్దెగాలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. జార్ఖండ్‌లో ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.