ఇంఫాల్, నవంబర్ 11 : మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, అనుమానిత మిలిటెంట్ల మధ్య సోమవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు మృతి చెందగా ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జిరిబామ్ జిల్లాలోని జకురాధోర్లో ఉన్న సీఆర్పీఎఫ్ పోస్ట్‌తో పాటు బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సాయుధ మిలిటెంట్లు దాడి చేయగా భద్రతా బలగాలు ప్రతిఘటించాయని మణిపూర్ పోలీసు శాఖ తెలిపింది. 40-45 నిమిషాలు భీకర కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి 10 మిలిటెంట్ల మృతదేహాలను, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నది. కాల్పులు జరిగిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న శరణార్థ శిబిరంలో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదని, వీరిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారా అనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. స్థానికంగా పలు దుకాణాలు, ఇండ్లను సైతం మిలిటెంట్లు దగ్ధం చేసినట్టు చెప్పారు. కాగా, మరణించిన 11 మంది కుకీ తెగకు చెందిన గ్రామ వలంటీర్లని కుకీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం కొండ ప్రాంతాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌పై ఆ రాష్ట్రంలోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన తమతో చర్చలు జరుపుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పడాన్ని ఖండించారు. వాస్తవాలను తెలుసుకోకుండా తుషార్ మెహతా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ప్రారంభమైన 2023 మే 3 నుంచి సీఎం తమతో చర్చలు జరపలేదని తెలిపారు. హింసాత్మక సంఘటనలకు సూత్రధారి ముఖ్యమంత్రేనని ఆరోపించారు.