ఇంఫాల్, మే 22: గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. రాజధాని ఇంఫాల్‌లో మైతీ, కుకీ తెగల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది. న్యూ చెకాన్ బజార్ ఏరియాలోని ఓ స్థానిక మార్కెట్లో దుకాణాల స్థలం విషయంలో వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పలువురు దుండగులు న్యూ లంబులనే ఏరియాలో పలు ఇండ్లకు నిప్పుపెట్టారు. దీంతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమికంగా అధికారులు వెల్లడించారు. ఇండ్లకు నిప్పుపెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ఇంఫాల్‌లో జరిగిన ఈ హింసాత్మక ఘటనలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు మళ్లీ కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజా హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఓ మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మణిపూర్‌లో కొద్ది రోజులుగా భద్రతా బలగాల పహారాలో అదుపులో ఉన్న పరిస్థితులు తిరిగి గాడితప్పే అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల మొదట్లో మణిపూర్‌లో పెద్దయెత్తున హింస చెలరేగింది.