Earthquake : ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్‌తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘాలయ (Meghalaya), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో జనం భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 5:59 గంటలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం మణిపూర్‌లోని కామ్‌జాంగ్ జిల్లాలో భూమికి 62 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.
దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే ఈశాన్య ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.