BJP | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’(ఈజీఐ) అధ్యక్షుడు సీమా ముస్తఫా, ముగ్గురు సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మణిపూర్ హింసపై తప్పుడు, కల్పిత, ప్రాయోజిత కథనాలను వెలువరించారని ఆరోపిస్తూ వారిపై పోలీసు కేసులు నమోదుచేసింది. మణిపూర్ సీఎం ఎన్ బీరేన్‌సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈజీఐ సభ్యులపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈజీఐ అధ్యక్షుడు సీమా ముస్తఫా, సీనియర్ జర్నలిస్టులు సీమా గుహ, సంజయ్ కపూర్, భరత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా’(పీసీఐ) దీనిని తీవ్రంగా ఖండించింది. ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
మణిపూర్ హింసపై ఏర్పాటైన ఈజీఐ నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను గత శనివారం మీడియాకు విడుదల చేసింది. జాతుల మధ్య ఘర్షణపై మీడియా రిపోర్టింగ్ ఏకపక్షంగా ఉందని, ప్రభుత్వ విధానాల వల్లే రెండు వర్గాల మధ్య విద్వేషం తలెత్తిందని నివేదిక ఆరోపించింది. ‘ప్రజాస్వామ్య ప్రభుత్వంగా తన విధులు నిర్వర్తించటంలో బీరేన్‌సింగ్ సర్కార్ విఫలమైంది. జాతుల మధ్య ఘర్షణలో ఒక వర్గానికి కొమ్ముకాసింది’ అని ఆరోపించింది.
ఈజీఐ కమిటీ ఆగస్టు 7-10 మధ్య రాష్ట్రంలో పర్యటించి మీడియా రిపోర్టింగ్‌పై అధ్యయనం చేసింది. ‘కుకీ గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ వలసదారులు అన్న ముద్రవేసింది. కుకీలకు వ్యతిరేకంగా మైతీలు చెలరేగిపోవడానికి ప్రభుత్వ వైఖరి కారణమైంది’ అని ఈ నివేదిక ఆరోపించింది.