న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ దేశాన్ని రక్షించడంలో మోదీ విఫలమయ్యారని, ఇది మరోసారి రుజువైందని, మణిపూర్ ఉగ్రదాడి ఘటనతో ఆయన అసమర్థుడని తేలిపోయిందని రాహుల్ ధ్వజమెత్తారు. మణిపూర్ ఉగ్రదాడిలో మరణించిన మృతుల కుటుంబాలకు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరవదు అని రాహుల్ పేర్కొన్నారు.
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదులు మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఖుగా బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని మందుపాతరలు పేల్చారు. బాంబులు విసిరారు. అనంతరం జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, ఆరేండ్ల కుమారుడితో పాటు మరో నలుగురు జవాన్లు .. మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చూరాచాంద్‌పూర్ జిల్లాలో భారత్–మయన్మార్ సరిహద్దు సమీపంలో ఈ తీవ్రవాద దాడి జరిగింది. మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎంఎన్‌పీఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.