న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్‌ను జారీచేసింది. ముఖ్యమైన అంశాలు చర్చకు, ఆమోదానికి రానున్న నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తప్పక సభకు హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సమావేశాల ఎజెండాను తెలుపకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు కేంద్రం బుధవారం ఎజెండాను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగ సభ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 ఏండ్ల పార్లమెంటరీ ప్రస్థానంపై తొలిరోజు చర్చ జరుగనున్నది. అలాగే ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, పోస్టాఫీసు బిల్లు, అడ్వకేట్స్ సవరణ బిల్లు, 2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 తదితర బిల్లులపై చర్చ జరుగనుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎంపీలకు విప్ జారీచేసింది. పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరుకావాలని నిర్దేశించింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాకు సంబంధించి కేంద్రం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ చెప్పారు. ‘పార్లమెంట్ సమావేశాల ఎజెండా చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ ఎజెండాను కేంద్రం విడుదల చేసింది. ఆ ఎజెండాను చూస్తే కేంద్రం ఏదో దాచిపెడుతున్నదన్న విషయం అర్థమవుతున్నది. సమావేశాలు జరిగేటప్పుడు అప్పటికప్పుడు కొన్ని కీలక అంశాలను ఎజెండాలో చేర్చి దేశాన్ని తప్పుదోవ పట్టించే అవకాశముంది’ అని ఆయన పేర్కొన్నారు.