న్యూఢిల్లీ: చెవుల్లో ఇయర్‌ఫోన్స్ (Ear phones) పెట్టుకున్న ఒక వ్యక్తి బిజీ రోడ్డును దాటాడు. వేగంగా వచ్చిన స్కూల్ బస్సు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 28 ఏళ్ల మనోజ్ కుమార్, ఢిల్లీలోని రంగపురిలో నివసిస్తున్నాడు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్న మనోజ్ కుమార్, వసంత్ కుంజ్ ప్రాంతంలోని మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు దాటాడు. అయితే స్కూల్ బస్సు వేగంగా రావడాన్ని అతడు గమనించలేకపోయాడు. దీంతో స్కూల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.
కాగా, ఇది గమనించిన అక్కడున్న వారు స్కూల్ బస్సు డ్రైవర్ అయిన 42 ఏళ్ల జస్బీర్ దహియాను పట్టుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అప్పగించారు. మనోజ్ కుమార్ మృతి గురించి ఉత్తరప్రదేశ్‌లోని అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.