అహ్మదాబాద్: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక వ్యక్తి పాకిస్థాన్‌కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Arrested For Spying Pak) గుజరాత్‌లోని కచ్‌లో ఈ సంఘటన జరిగింది. సహ్‌దేవ్ సింగ్ గోహిల్ ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నాడు. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకున్నాడని గుజరాత్ ఏటీఎస్ ఎస్పీ కే సిద్ధార్థ్ తెలిపారు. ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అని ఆ తర్వాత అతడు తెలుసుకున్నాడని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సైట్ల ఫోటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్ ద్వారా వాటిని పంపించాడని ఆరోపించారు.
కాగా, 2025 ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడని, పాక్ మహిళా ఏజెంట్‌తో సంప్రదింపుల కోసం వాట్సాప్‌ను యాక్టివేట్ చేశాడని ఏటీఎస్ ఎస్పీ కే సిద్ధార్థ్ తెలిపారు. ఆ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుంచి బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు చెప్పారు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 చెల్లించినట్లు ఏటీఎస్ నిర్ధారించిందని అన్నారు.
మరోవైపు మే 1న గోహిల్‌ను పిలిచి ప్రశ్నించామని, దర్యాప్తు తర్వాత అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ ఎస్పీ కే సిద్ధార్థ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న అతడి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. సహ్‌దేవ్ సింగ్ గోహిల్తోపాటు పాక్ లేడీ ఏజెంట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.