చెన్నై: క్యాన్సర్ చికిత్స కోసం తల్లి ఉంచిన డబ్బుతో ఒక వ్యక్తి రమ్మీ గేమ్ ఆడాడు. (man plays rummy) ఇది తెలిసి తల్లి, సోదరుడు అతడ్ని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి తండ్రి ఎనిమిదేళ్ల కిందట మరణించాడు. దీంతో తల్లి, అన్నతో కలిసి చిన్నమలైలోని సెకండ్ స్ట్రీట్‌లో అతడు నివసిస్తున్నాడు.
కాగా, అప్పుడప్పుడు ఫుడ్ వ్యాపారం చేసే ఆ వ్యక్తి కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో డబ్బులు వృథాగా ఖర్చు చేయసాగాడు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ బారిన పడిన తల్లి తన చికిత్స కోసం ఉంచిన రూ.30,000లు అతడు దొంగిలించాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తల్లి, అన్న కలిసి ఆ వ్యక్తిని మందలించారు. దీంతో శుక్రవారం అతడు అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో తల్లి, సోదరుడు ఆ వ్యక్తి కోసం అంతా వెతికారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. చివరకు శనివారం తెల్లవారుజామున ఇంటి టెర్రస్‌పై వెతికారు. టీవీ కేబుల్ వైర్ మెడకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడిన అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.