లక్నో: ఒక సామాజిక కార్యకర్త అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై గళమెత్తాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆ వృద్ధుడు చివరకు మరణించాడు. (Man On Hunger Strike Dies) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మధుర జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని సామాజిక కార్యకర్త అయిన 66 ఏళ్ల దేవకీనంద్ శర్మ ఆరోపించాడు. దీని గురించి గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు కోసం నియమించిన కమిటీలో సభ్యుడిగాను ఆయన ఉన్నాడు.
కాగా, ఈ అవినీతిపై ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను దేవకీనంద్ శర్మ వ్యతిరేకించాడు. మళ్లీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. ఫిబ్రవరి 12 నుంచి ఇంటి సమీపంలో ఉన్న ఆలయం బయట నిరాహార దీక్ష చేపట్టాడు. నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీని గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు నిరాహార దీక్షలో ఉన్న శర్మను తొలుత స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశ్ కుమార్ సోమవారం ఆసుపత్రిలో శర్మను కలిశారు. ఆయన డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, నిరాహార దీక్ష విరమించాలని కోరారు. అవినీతిపై తాజా దర్యాప్తు కోసం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని శర్మ అన్నారు. ఆ అధికారం తనకు లేదంటూ ఆ అధికారి వెళ్లిపోయారు. అయితే నాలుగు నెలలుగా నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.