న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి ఒక యువతితో సహజీవనం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సహోద్యోగి ఆమెతో స్నేహం కోసం ఆసక్తి చూపాడు. ఈ నేపథ్యంలో ఆ జంట అతడ్ని హత్య చేసింది. (Man, Live-In Partner Kill Colleague) దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన 40 ఏళ్ల సోన్పాల్, గురుగ్రామ్‌లోని ఖోహ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. మానేసర్‌లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కైమ్తాల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కుశాల్‌పాల్ సింగ్ అలియాస్ కౌశల్ అదే కంపెనీలో జూనియర్ ఉద్యోగి. మనేసర్‌లోని సెక్టార్ 1లో వసతి గృహంలో 19 ఏళ్ల భావనతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెతో స్నేహం చేయాలని ఉన్నదని కౌశల్ వద్ద సోన్పాల్ పలుసార్లు ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న భావనతో కలిసి అతడ్ని కౌశల్ హత్య చేశాడు.
అక్టోబర్ 4న చోరీ చేసిన బైక్‌పై సోన్‌పాల్‌ను మధురకు వారిద్దరూ తీసుకెళ్లారు. ఎక్స్‌ప్రెస్ వే వద్ద హెల్మెట్‌తో అతడి తలపై కౌశల్ కొట్టాడు. కత్తితో మెడపై ఏడుసార్లు పొడిచి చంపాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి భావనతో కలిసి పారిపోయారు.
మరోవైపు అక్టోబర్ 4న ఆఫీస్‌కు వెళ్లిన సోన్పాల్ సాయంత్రం 4.30కు ఇంటికి తిరిగి వస్తానని సోదరికి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి సొంతూరు మధుర వెళ్దామని పేర్కొన్నాడు. అయితే సోన్పాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అదే కంపెనీలో పనిచేస్తున్న కౌశల్‌పై అనుమానం వ్యక్తం చేశారు. గురువారం అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారు.
కాగా, సహజీవనం చేస్తున్న భావనతో స్నేహం కోరడంతో సోన్‌పాల్‌ను హత్య చేసినట్లు కౌశల్ తెలిపాడు. మృతదేహం ఉన్న ప్రదేశం గురించి చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం భావనను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన కత్తి, హెల్మెట్, బైక్, ఇతర వస్తువులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్‌లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి
Bihar election results | ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు.. బీజేపీ, జేడీ(యూ)కి దక్కిన సీట్లు
RK Singh Suspended | బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్