Crime news : ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అత్తింటిపై కోపం పెంచుకున్న అతను వాళ్లను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నెట్లో చూసి బాంబులు తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఓ బాంబును పేల్చి ఇద్దరు గాయపడటానికి కారణమయ్యాడు. చివరికి పోలీసులక చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన రూపేన్ రావు (44) కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేగాక కోర్టులో విడాకుల కేసు వేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. దాంతో తన భార్యా, పిల్లలు తనకు దూరం కావడానికి ఆమె స్నేహితుడు, తండ్రి, సోదరుడే కారణమని రూపేన్ రావు భావించాడు.
ఆ ముగ్గురిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇంటర్నెట్లో వెతికి రిమోట్‌తో పేల్చే బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ బాంబులతో భార్య స్నేహితుడు బల్దేవ్ సుఖాడియాను, ఆ తర్వాత ఆమె తండ్రిని, సోదరుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా సుఖాడియా ఇంటికి గాధవితో పార్శిల్ బాంబు పంపించాడు. సుఖాడియా పార్శిల్ తీసుకోగానే రిమోట్‌తో బాంబు పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాధవిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు రూపేన్ రావును, అతడికి సహకరించిన రోహన్ రావల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరో రెండు రిమోట్ బాంబులు, ఒక పిస్టల్, బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే రూపేన్ రావు తొలి ప్రయత్నంలోనే పట్టుబడటంతో అతని మామ, బావమరిదిని చంపాలనే ప్లాన్ బెడిసికొట్టింది. పైగా అతడు కటకటాలపాలు కావాల్సి వచ్చింది.