Bomb blast : నాటుబాంబు (Crude bomb) తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు (Blast) సంభవించి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ముర్సీదాబాద్ (Mursidabad) జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ముర్సీదాబాద్ జిల్లా రాణినగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చెతియాని ఏరియాకు చెందిన ఉస్మాన్ బిశ్వాస్.. శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలో నాటుబాంబులు చుడుతుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో బిశ్వాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
బిశ్వాస్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా పదుల సంఖ్యలో నాటుబాంబులు లభ్యమయ్యాయి. అయితే బిశ్వాస్ ఆ బాంబులను ఎందుకు తయారు చేస్తున్నాడనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.