ముంబై, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. తన పుట్టినరోజుకి దుబాయ్ తీసుకెళ్లలేదనే కోపంతో ఓ మహిళ భర్తను కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకొంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన నిఖిల్ ఖన్నా వ్యాపారవేత్త. ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా భర్త నుంచి విలువైన బహుమతులు ఆశించింది. బర్త్డే వేడుకల కోసం దుబాయ్ తీసుకువెళ్లాలని పట్టుబట్టింది. అందుకు నిఖిల్ నిరాకరించాడు. అంతేకాకుండా, బంధువుల బర్త్డే పార్టీల కోసం ఢిల్లీకి వెళ్లేందుకు కూడా అతను ఆసక్తి చూపలేదు. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. వివాదం కాస్త పెరగడంతో భర్తపై దాడికి దిగింది. అతడి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని దవాఖానకి తరలించగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.