న్యూఢిల్లీ: పుచ్చకాయను తిని అస్వస్థతకు గురైన ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా షియోపూర్‌కు చెందిన ఇంద్రకుమార్ పరిహార్ (43) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం కొడుకు వినోద్‌తో కలిసి పుచ్చకాయను తిన్నాడు. ఆ తర్వాత వారిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వారిని షియోపూర్ దవాఖానకు తరలించారు.
ఇంద్రకుమార్ పరిస్థితి విషమించడంతో కోటాకు తరలిస్తుండగా మృతి చెందాడు. వినోద్ పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా దవాఖాన సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ మాట్లాడుతూ..పుచ్చకాయ తినడం వల్లే ఇంద్రకుమార్ మృతి చెందాడని ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. అతడి కడుపునకు ఇన్ఫెక్షన్ సోకిందా అనేది తెలియాల్సి ఉన్నదన్నారు. పుచ్చకాయలో విష పదార్థం లేదా రసాయనాలు కలిశాయా అనేది పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చాక తేలుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.