లక్నో: ముస్లిం భార్య వల్ల వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. గ్రైండింగ్ రాయితో తల్లిదండ్రులను కొట్టి చంపాడు. మృతదేహాలను ముక్కలుగా నరికాడు. ఆ భాగాలను సిమెంట్ సంచుల్లో పట్టుకెళ్లి నదిలో పడేశాడు. వృద్ధ దంపతుల మిస్సింగ్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Man Kills Parents, Cuts Bodies) ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో సంఘటన జరిగింది. 62 ఏళ్ల శ్యామ్ బహదూర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. 60 ఏళ్ల భార్య బబితతో కలిసి అహ్మద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కాగా, ఐదేళ్ల కిందట ఇంజినీర్ అయిన కొడుకు అంబేష్ కరోనా సమయంలో కోల్‌కతాకు చెందిన ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే కొడుకు మతాంతర వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ముస్లిం కోడలిని తమ ఇంట్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే ముస్లిం భార్యను విడిచిపెట్టాలని కొడుకు అంబేష్‌కు తండ్రి శ్యామ్ బహదూర్ తెగేసి చెప్పాడు. దీంతో ఈ విషయంపై చాలా కాలంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
మరోవైపు ముస్లిం భార్యను వదిలేయాలని అంబేష్ నిర్ణయించాడు. దీనికి ఆమె కూడా అంగీకరించింది. భరణం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అంబేష్ మూడు నెలల కిందట కోల్‌కతా నుంచి సొంత గ్రామానికి చేరుకున్నాడు. తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నాడు. భార్యకు భరణం ఇచ్చేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు.
డిసెంబర్ 8న డబ్బు విషయంమై తల్లిదండ్రులు, అంబేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు గ్రైండింగ్ రాయితో తల్లి బబిత తలపై కొట్టడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఇది చూసి తండ్రి శ్యామ్ బహదూర్ ఆందోళన చెందాడు. అరిచి స్థానికులను అలెర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అదే గ్రైండింగ్ రాయితో తండ్రి తలపై పలుమార్లు కొట్టి చంపాడు. తల్లిదండ్రుల మృతదేహాలను రంపంతో ముక్కలుగా నరికాడు. పలు సిమెంట్ సంచుల్లో వాటిని మూట కట్టాడు. కారులో తీసుకెళ్లి సమీపంలోని నదిలో పడేశాడు.
ఆ తర్వాత సోదరి వందనకు అంబేష్ ఫోన్ చేశాడు. గొడవ జరుగడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. వారిని వెతికేందుకు తాను వెళ్తున్నట్లు చెప్పాడు. అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరుడి ఆచూకీ తెలియకపోవడంతో వందన ఆందోళన చెందింది. డిసెంబర్ 13న జౌన్‌పూర్‌లోని జఫరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది.
కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోదరితో మాట్లాడిన తర్వాత అంబేష్ తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడంపై అనుమానించారు. అయితే డిసెంబర్ 14న జౌన్‌పూర్‌కు అంబేష్ తిరిగి వచ్చాడు. తల్లిదండ్రుల గురించి సోదరి వందన, బంధువులు అడగ్గా తప్పుదారి పట్టించే కథలు చెప్పాడు. ఈ నేపథ్యంలో అంబేష్ తిరిగి వచ్చినట్లు పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అంబేష్ను పోలీసులు ప్రశ్నించగా తొలుత తప్పుదారిపట్టించేందుకు ప్రయత్నించాడు. చివరకు తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హత్యకు వినియోగించిన గ్రైండింగ్ స్టోన్, మృతదేహాన్ని ముక్కలుగా కోసిన రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రికి చెందిన ఒక మృతదేహం భాగాన్ని గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వృద్ధ దంపతుల మిగతా భాగాల కోసం గజ ఈతగాళ్లతో ఆ నదిలో గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడు అంబేష్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా 1,500.. 3 నెలల్లో 27,000కుపైగా జననాలు!
Watch: బావిలో పడిన కుమార్తె.. కాపాడేందుకు అందులోకి దూకిన తండ్రి