పాట్నా: ఒక వ్యక్తి ఇటీవల భూమిని అమ్మాడు. వారి నుంచి డబ్బు తీసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడ్ని అడ్డుకున్నారు. తీవ్రంగా కొట్టి చంపారు. అతడి వద్ద ఉన్న డబ్బు కూడా మాయమైంది. (man beaten to death) కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హర్పూర్ భిండి గ్రామానికి చెందిన కుశేశ్వర్ రాయ్ ఇటీవల ఒక భూమిని విక్రయించాడు. అందాల్సిన సొమ్ములో రూ. 2 లక్షలు తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.
కాగా, మార్గమధ్యలో కొందరు వ్యక్తులు కుశేశ్వర్ రాయ్‌ను అడ్డుకున్నారు. అతడ్ని కొట్టి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుశేశ్వర్ను కొట్టిన తర్వాత అతడితో బలవంతంగా విషపదార్థం తినిపించినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. అతడి హత్యతో పాటు నగదు ఉన్న బ్యాగ్ మాయం కావడంపై ఆగ్రహించారు. కుశేశ్వర్ మృతదేహంతో నిరసన తెలిపారు. జాతీయ రహదారి 28ని దిగ్బంధించారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నిరసనకారులు రోడ్డుపై టైర్లను కాల్చడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు రోడ్డు దిగ్బంధాన్ని వీడారు. కుశేశ్వర్ హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.