పిలిభిత్: సమోసాలు (Samosas) తేలేదన్న కోపంతో ఓ మహళి తన భర్తను చితకబాదిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకున్నది. పిలిభిత్ జిల్లాలోని ఆనంద్‌పూర్‌కు చెందిన శివమ్ అనే వ్యక్తికి తన భార్య సంగీత సమోసాలు తీసుకురమ్మని ఆగస్టు 30న చెప్పింది. అయితే అతడు తేలేకపోయాడు. మరుసటి అతనిపై తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు గ్రామ పెద్ద అవ్‌దేశ్ శర్మ వద్ద పంచాయితీ పెట్టారు.
పంచాయితీకి శివమ్తోపాటు అతని తల్లి, మరికొందరు కుటుంబీకులు హాజరవగా, సంగీత తన తల్లిదండ్రులతోపాటు మేనమామ, మరికొందరితో కలిసి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటామాట పెరగడంతో.. సంగీత తల్లిదండ్రులు, బంధువులు.. శివమ్‌ను చచ్చేలా కొట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని బంధువులపై కూడా దాడి చేశారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని.. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. బాధితుని తల్లి విజయ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.