బెంగళూరు: హిందూ వ్యక్తి, ముస్లిం మహిళ ప్రేమించుకున్నారు. అయితే రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత మతం మారాలని తన భార్య బలవంతం చేసిందని భర్త ఆరోపించాడు. (Man Alleges Wife Forced Him Convert) ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విశాల్ కుమార్ గోకవి, తహసీన్ హోసమణి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. 2024 నవంబర్‌లో వారిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
కాగా, ఈ పెళ్లి తర్వాత ముస్లిం ఆచారం ప్రకారం మళ్లీ వివాహం చేసుకుందామని తహసీన్ తనపై ఒత్తిడి తెచ్చిందని విశాల్ కుమార్ ఆరోపించాడు. తమ సంబంధం శాంతియుతంగా కొనసాగేందుకు దానికి ఒప్పుకున్నట్లు తెలిపాడు. దీంతో ఏప్రిల్ 25న తామిద్దరం ముస్లిం ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే ఈ పెళ్లి సందర్భంగా తనకు తెలియకుండానే తన పేరుతోపాటు మతాన్ని మార్చారని అతడు ఆరోపించాడు.
మరోవైపు జూన్ 5న తన కుటుంబం హిందూ ఆచారాలతో పెళ్లి జరిపేందుకు సన్నాహాలు చేసిందని విశాల్ కుమార్ తెలిపాడు. తొలుత దీనికి అంగీకరించిన భార్య తహసీన్, ఆమె కుటుంబం ఒత్తిడితో వెనక్కి తగ్గిందని చెప్పాడు. ఇస్లాం మతంలోకి మారాలని తనను బలవతం చేస్తున్నదని, మారకపోతే అత్యాచారం కేసు పెడతానని ఆమె బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తహసీన్ తల్లి బేగం బాను కూడా నమాజ్ చేయాలని, జమాత్‌కు హాజరు కావాలని తనను బలవంతం చేస్తున్నట్లు ఆరోపించాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman Strangles Daughter | ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ.. కుమార్తెను చంపి భర్తపై నింద
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?