Mumbai Blast Case | 2006 ముంబై పేలుళ్ల కేసు (Mumbai Blast Case)లో అబ్దుల్ వహీద్ షేక్ (Abdul Wahid Shaikh) నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. 2015లో స్పెషల్ కోర్టు అబ్దుల్ వహీద్‌ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. అయితే, ఈ కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేసి తొమ్మిదేళ్ల పాటూ జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారని (Custodial Torture), పేలుళ్ల కేసులో అరెస్టు చేయడంతో తన జీవితం మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయానికి రూ. 9 కోట్లు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు వహీద్ జాతీయ మానవ హక్కుల కమిషన్, మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2006 జులై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు సబర్బన్ రైళ్లలో (suburban railway network) వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో అబ్దుల్ వహీద్ షేక్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Maharashtra Anti-Terrorism Squad) అరెస్టు చేసింది. అయితే సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత 2015లో స్పెషల్ కోర్టు అబ్దుల్ వహీద్‌ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.
మిగతా 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా.. మరో ఏడుగురికి జీవతఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది. అందులో ఒకరు 2021లో కరోనా కారణంగా నాగ్‌పూర్ జైల్లో మృతి చెందాడు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఈ ఏడాది జులైలో మిగిలిన నిందితులను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. మరే ఇతర కేసులు వారిపై లేనట్టయితే.. వారందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించటంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని, దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నట్టు బెంచ్ పేర్కొన్నది. హైకోర్టు నుంచి వెలువడిన ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
Also Read..
Bomb threat | ఢిల్లీలో కలకలం.. తాజ్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపు
Digital Arrest | సైబర్ నేరగాళ్ల వలలో వృద్ధుడు.. డిజిటల్ అరెస్ట్‌తో రూ.3.72 కోట్లకు టోకరా
PM Modi | మణిపూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండేండ్ల తర్వాత తొలిసారి