Digital Arrest : ఈ మధ్య సైబర్ నేరగాళ్లు (Cyber cheaters) అనుసరిస్తున్న కొత్త పంథా డిజిటల్ అరెస్ట్ (Digital Arrest). మీరు కేసుల్లో ఇరుక్కున్నారంటూ నమ్మిస్తారు. భయపెట్టి, ఒత్తిడికి గురిచేస్తారు. వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి ఒత్తిడికి లోనవగానే దాన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు దండుకుంటారు. ఇలాంటి వాటిపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా పలువురు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు.
తాజాగా కేరళలోని కొల్లాంలో 79 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. కొల్లాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కేరళ జిల్లాలోని ఓ వృద్ధుడికి జూలై 7న వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను బీఎస్ఎన్ఎల్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అక్రమ కార్యకలాపాలకు మొబైల్ నంబర్ వినియోగించినందుకు ముంబై సైబర్ పోలీసులు ఈ నంబర్‌ను ట్రాక్ చేస్తున్నారని తెలిపాడు.
కొద్దిసేపటికి దుండగులు పోలీసు దుస్తుల్లో వాట్సాప్ వీడియో కాల్ చేసి తాము ముంబై సైబర్ పోలీసులమని పేర్కొంటూ నకిలీ అరెస్టు వారెంట్ జారీ చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు డిజిటల్ అరెస్టు చేశామని వృద్ధుడిని బెదిరించారు. ఇందుకుగాను వీడియో కాల్ ద్వారా వర్చువల్ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. బాధితుడు వారు చెప్పినట్లు చేయగా వాట్సాప్ కాల్‌ను కట్ చేయకుండా దర్యాప్తు అధికారి నిఘాలో ఉండాలనే షరతుతో వర్చువల్ కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి పరిశీలన కోసం ఖాతాల్లో ఉన్న డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేయాలని సూచించారు. లేదంటే ఈ కేసులో శిక్ష పడుతుందని బెదిరించడంతో ఆందోళన చెందిన వృద్ధుడు.. జూలై 23 నుంచి ఆగస్టు 29 మధ్య వారు చెప్పినట్లుగా వివిధ ఖాతాలకు 17 లావాదేవీలలో రూ.3.72 కోట్లను బదిలీ చేశాడు. వారు ఎంతకీ డబ్బు తిరిగి పంపకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొల్లాం పోలీసులు తెలిపారు. డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించామని, వాటిని బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.