ముంబై: ఒక వ్యక్తి మహిళను వేధించాడు. ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అతడ్ని కొట్టారు. అంతటితో ఆగక కత్తితో పొడిచి ఆ వ్యక్తిని హత్య చేశారు. (Man Stabbed To Death) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళ కుటుంబానికి చెందిన పది మందిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 21న హడ్గావ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల షేక్ అరాఫత్ స్థానికంగా ఉన్న ఒక మహిళను వేధించాడు.
కాగా, మహిళను ఆ వ్యక్తి పలుమార్లు వేధించినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఈ సంఘటనపై ఆగ్రహించారు. అరాఫత్ ఇంటికి వారు చేరుకున్నారు. అతడ్ని కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అరాఫత్ తల్లిని కూడా కొట్టారు. కత్తితో అరాఫత్‌ను పొడిచి అతడ్ని హత్య చేశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అరాఫత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి హత్యకు సంబంధించి మహిళ తల్లిదండ్రులు, బంధువులతో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.