చెన్నై: నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. (Accused Man Dies) పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా బర్గూర్లో ఇటీవల నకిలీ ఎన్సీసీ క్యాంపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బాలికలపై కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తమిళర్ కట్చి (ఎన్టీకే) మాజీ కార్యకర్త ఏ శివరామన్ 12 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు అందింది. ఈ కేసులో స్కూల్ అధికారులు, శివరామన్ సహచరులు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, ఆగస్ట్ 18న శివరామన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా కాలు విరిగింది. అయితే అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఎలుకల మందు సేవించినట్లు పోలీసులకు శివరామ్ చెప్పాడు. దీంతో అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు మరో సంఘటనలో శివరామ్ తండ్రి కూడా మరణించాడు. గురువారం రాత్రి కావేరిపట్టణంలో బైక్పై నుంచి పడి చనిపోయాడు. ఈ నేపథ్యంలో శివరామ్ మరణంతోపాటు అతడి తండ్రి మృతిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.