కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, తాజాగా 20 మంది ఎంపీలు ఝలక్ ఇచ్చారు. ఇండియా కూటమి మీటింగ్‌కు మమత హాజరైన కొన్ని గంటలకే.. 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతిస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసినట్టు టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ తెలిపారు. ప్రస్తుత పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు. ఈ 20 మంది ఎంపీలు ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డామని.. లోక్‌సభలో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయించాలని లేఖలో కోరినట్టు వెల్లడించారు. ప్రస్తుతం టీఎంసీలో 28 మంది లోక్‌సభ ఎంపీలుండగా.. 20 మంది రెబల్‌గా మారారు.
సుఖేందు రాజీనామా చేసిన వెంటనే..
టీఎంసీలో సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేసిన అగ్రనేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడం సంచలనం రేపింది. మమతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సుఖేందు టీఎంసీలో అవినీతి పెరిగిపోయిందని, మహిళలపై అణచివేత, దోపిడీలు, మోసాలు ఎక్కువయ్యాయని.. విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ పరిపాలనపై ప్రశంసలు కురిపించారు. చరిత్రలో మొదటిసారి బెంగాల్ ప్రజలు కాషాయపార్టీకి అధికారం ఇచ్చారని.. హామీల అమలు కోసం ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిందన్నారు. సుఖేందు రాజీనామాను మమత ఆమోదించిన కొద్ది సేపటికే 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో 13 మంది ఎంపీలతో సుఖేందు భేటీ అయ్యారు. వీరు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, బెంగాల్ సీఎం సువేందు అధికారితో ఢిల్లీలో భేటీ తర్వాత ఎన్డీయేకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సహా పలు కేసుల్లో నిందితునిగా ఉన్న టీఎంసీ నేత జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు.
తిరుగుబాటు మరింత పెరుగుతుంది..
20 మంది ఎంపీల తిరుగుబాటుపై రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ ఎమ్మెల్యేల్లో మొదలైన తిరుగుబాటు ఎంపీలదాకా వెళ్లిందని.. గంటలు గడిచేకొద్దీ ఈ అసంతృప్తి మరింత పెరిగే చాన్స్ ఉందన్నారు. ఇక ఎంపీల తిరుగుబాటుపై మమతా బెనర్జీ ఇప్పటి దాకా స్పందించలేదు. పార్టీపై మమత పట్టు కోల్పోయారని.. అందుకే ఇలా జరుగుతున్నదంటూ బీజేపీ నేతలు అంటున్నారు.