కలిసి కనీసం ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయనే లేదు. అప్పుడే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి బీటలు వారుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్న కూటమిలోని పార్టీల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా తయారైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని తాజాగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ప్రకటించాయి.
INDIA Alliance | కోల్‌కతా/చంఢీగఢ్, జనవరి 24:లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం బెంగాల్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో మమత ప్రకటన సంచలనంగా మారింది. సీట్ల పంపంకం విషయంలో తాను కాంగ్రెస్‌కు ఒక ప్రతిపాదన చేశానని, అయితే అందుకు ఆ పార్టీ అంగీకరించలేదని మమత తెలిపారు. బీజేపీని ఓడించేందుకు ఏమైనా చేస్తామన్నారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, తృణమూల్ మధ్య చర్చలు నడుస్తున్నాయన్న వార్తలను ఆమె కొట్టివేశారు. ఈ విషయంపై తాను కాంగ్రెస్‌లోని ఎవరితో చర్చించలేదని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో వారి జోక్యాన్ని సహించేది లేదని మమత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్నదని, ఎన్నికల తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉంటాయని, ప్రతిపక్ష కూటమి ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాహుల్ యాత్రపైనా మమత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోకి గురువారం ప్రవేశించనున్న వారి యాత్ర గురించి కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ఆ మర్యాద కూడా వారికి(కాంగ్రెస్) లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, మమత ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇండియా కూటమికి టీఎంసీ పార్టీ ముఖ్యమైన పిల్లర్ అని, ఆ పార్టీ లేకుండా కూటమిని ఊహించుకోలేమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ అసలు ఇండియా కూటమికి సిద్ధాంతం అనేది లేదని, కేవలం మోదీ వ్యతిరేక వేదికగానే ఏర్పడిందని విమర్శించారు.
సీట్ల సర్దుబాటు విబేధాలే మమత తాజా ప్రకటనకు కారణమని తెలుస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ సీట్లలో టీఎంసీ 22, కాంగ్రెస్ 2, బీజేపీ 18 స్థానాల్లో గెలిచాయి. గత ఎన్నికల్లో ప్రదర్శన ప్రకారం హస్తం పార్టీకి మమత రెండు స్థానాలు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే తమకు 10-12 సీట్లు కావాలని కాంగ్రెస్ అడుగ్గా.. అందుకు మమత అంగీకరించలేదని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.
సీఎం మమత ప్రయాణిస్తున్న కారు బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు వస్తుండగా.. అకస్మాత్తుగా ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఒక వాహనం వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. ముందు సీట్లో కూర్చొన్న మమత విండ్‌షీల్డ్‌కు ఢీకొన్నారు. దీంతో ఆమె తలకు స్వల్ప గాయమైందని అధికారులు వెల్లడించారు.
పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ కూడా అన్ని లోక్‌సభ స్థానాల్లో ఒంటిరిగానే పోటీచేస్తుందని రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్ బుధవారం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని మరోసారి స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి పంజాబ్‌లో చరిత్ర సృష్టిస్తామని మాన్ అన్నారు. 13 స్థానాల్లో ఇప్పటికే 40 మంది ఆశావహులను షార్ట్‌లిస్టు చేశామని తెలిపారు. ఛండీగఢ్ స్థానంలో కూడా పోటీచేస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్‌లలో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తున్నది.