కోల్‌కతా, మే 9: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్‌లోని విపక్షాలన్నీ ఏకమై ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం పిలుపునిచ్చారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వివిధ అనుబంధ విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు ఏకం కావాలని ఆమె కోరారు. వామపక్ష, అతివాద వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడానికి ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. జాతీయ పార్టీలు కూడా ఇందులో భాగం కావాలని ఆమె కోరారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతి నేపథ్యంలో కాళీఘాట్‌లోని తన నివాసం వద్ద చిన్న సమూహాన్ని ఉద్దేశించిన మమత ప్రసంగిస్తూ బీజేపీని వ్యతిరేకించే విషయంలో తనతో సంప్రదింపులు జరపదలచుకున్న ఏ రాజకీయ పార్టీతోనైనా మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. శత్రువునకు శత్రువు మన మిత్రుడు అని అనుకోవడానికి ఇది సమయం కాదు. మన మొదటి శత్రువు బీజేపీనే అని మమత స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కొన్ని చోట్ల గూండాయిజం జరుగుతోంది. వారి(బీజేపీ) శ్రేణుల్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయి అని ఆమె ఆరోపించారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎవరిపైనా ఆఘాయిత్యాలు జరగనివ్వలేదని మమత చెప్పారు.
ఎట్టకేలకు ఓటమి అంగీకారం.. బయోలో వివరాల మార్పు
పశ్చిమబెంగాల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదని, బీజేపీ కుట్రతోనే తనను ఓడించిందని భీష్మించుకు కూర్చున్న ఆమె ఎట్టకేలకు దిగివచ్చారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో తన బయోను మార్చడం ద్వారా ఆమె ఓటమిని ఒప్పుకున్నారు. దీదీ తన బయోను అప్ డేట్ చేస్తూ, దానిలో తాను మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘తృణమూల్ అధ్యక్షురాలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15,16, 17 అసెంబ్లీలకు) అని తన కొత్త బయోలో రాశారు. శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న సమయంలో మమత తన బయోను అప్డేట్ చేశారు.
అవినీతి నేతలకే అందలం.. సువేందుపై లంచం ఆరోపణలను ప్రస్తావించిన శివసేన, ధ్రువ్ రాఠీ
ముంబై: బెంగాల్ సీఎంగా సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించిన క్రమంలో బీజేపీపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌతు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి నేతలకు అధికారాన్ని ఇచ్చే సంప్రదాయాన్ని బీజేపీ కొనసాగిస్తున్నదని ఆయన ఆరోపించారు. 2020లో నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్‌లో సువేందు అధికారి సహా ఐదుగురు టీఎంసీ ఎంపీలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని మీడియా సమావేశంలో ఆరోపించారు.
తర్వాత టీఎంసీ ఎంపీగా ఉన్న సువేందు ఇంటిపై ఈడీ దాడులు జరిపిందని, అనంతరం ఆయన బీజేపీలో చేరారని, దాంతో కేసులు కొండెక్కాయని, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే అయిపోయారని విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా శనివారం ఒక వీడియోలో పేర్కొన్నారు.రౌత్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీజేపీ అధికారి ప్రతినిధి నవనాథ్ బన్, సువేందు అధికారిపై నమోదైన ఆరోపణలు రుజువు కాలేదని, అవినీతి కేసులో రౌత్ జైలుకు కూడా వెళ్లిన విషయాన్ని మరువరాదని అన్నారు.