Mamata Banerjee | ప్రేమికుల దినోత్సవం రోజు (ఫిబ్రవరి 14) న ఆవులను కౌగిలించుకోండి అని హిందూ సంస్థలు చేసిన సూచనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెరైటీగా విరుచుకుపడ్డారు. సోమవారం నాడు అసెంబ్లీలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ కౌ హగ్ విజ్ఞప్తి చేసిన వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో గాయపడితే ఎవరు దిక్కు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని నిండు సభలో కోరారు.
‘ప్రేమికుల దినోత్సవం నాడు కౌ హగ్ చేమని మమ్మల్ని అడిగారు. సరే అయితే, ఆవులు కొమ్ముతో కొడితే? ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ సాహసోపేతమైన పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, దీనికి ముందుగా ఆవును కౌగిలించుకునే వ్యక్తికి రూ.10 లక్షలు, గేదెను కౌగిలించుకునే వారికి రూ.20 లక్షల బీమా బీజేపీ ఇవ్వాలి’ అని మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పారు.
ఈ నెల 14 న కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే జాతీయ జంతు సంరక్షణ బోర్డు లేఖను విడుదల చేసి విజ్ఞప్తి చేసింది. దీనిపై విమర్శలు రావడంతో మరుసటిరోజే ఈ అప్పీలును ఉపసంహరించుకున్నది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. సరిహద్దులో అమాయకులు బలి అవుతున్నారని సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని కూడా పంపలేదన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, దేశంలో అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని మమత విజ్ఞప్తి చేశారు.