కోల్కతా, మార్చి 29: బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరమున్నదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నొక్కిచెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలపై వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఈ మేరకు బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు, కాంగ్రెస్ సహా విపక్షాలకు ఆదివారం లేఖ రాశారు. లేఖను మంగళవారం ఆ పార్టీ విడుదల చేసింది. ‘బీజేపీకి వ్యతిరేకంగా అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చలు సాగిద్దాం. తద్వారా పార్టీలన్నీ కలిసి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడే వీలు కలుగుతుంది. అప్పుడే దేశం కోరుకొనే సమర్థమంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమ’ని మమత అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఫ్రీపాస్ ఉంటుందని, అక్కడి ప్రభుత్వాలు ఎంత డొల్లగా ఉన్నా.. ఆ సంస్థలకు అవేమీ కనిపించవని విమర్శించారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదని మండిపడ్డారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ విచారణకు తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ హాజరుకాలేదు.