హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం(CEC )బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సీఈసీ, బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
పశ్చిమ బెంగాల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ విలన్లా మారారని ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థలు బీజేపీకి పూర్తిగా సహకరించాయన్నారు. సర్‌తో పేరుతో 90 లక్షలు ఓట్లు తొలగించారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందని విమర్శించారు.
ఇలాంటి ఎన్నికలు తన జీవితంలో చూడలేదన్నారు. సీఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని, ఓట్ల చోరీపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు నాతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, తాను ఇండి కూటమిలోనే ఉన్నానని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
తాను లోక్‌సభకు వెళ్తాననే వార్తల్లో నిజం లేదన్నారు. బెంగాల్లోనే ఉండి పోరాడుతానని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కంచుకోటలో బీజేపీ కూటమి తొలిసారిగా పాగా వేసింది. మొత్తం 294 సీట్లలో 208 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకొన్నది. భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమత.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.