కోల్కతా: ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ బీజేపీ అప్రజాస్వామికంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి విమర్శించారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలతో మమతా బెనర్జీ శనివారం సమావేశమయ్యారు. లోక్సభలో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వం మనుగడపై సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో అన్నది తమ పార్టీ ఎదురు చూస్తుందని, వేచి ఉంటుందని అన్నారు.
కాగా, దేశానికి మార్పు అవసరమని, దేశం మార్పు కోరుకుంటోందని మమతా బెనర్జీ తెలిపారు. లోక్సభ ఎన్నికల తీర్పు ఈ మార్పు కోసమే అని అన్నారు. ‘మేం వేచి ఉన్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం. ఎన్నికల తీర్పు మోదీకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆయన ఈసారి ప్రధాని కాకూడదు. వేరొకరు ప్రధాని పదవి చేపట్టేందుకు అనుమతించాలి’ అని మీడియాతో అన్నారు.
మరోవైపు బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. అందుకే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి తమ పార్టీ హాజరుకాదని తెలిపారు. ‘ఈ రోజు ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు. కానీ రేపు అది సాధ్యం కావచ్చు. మరికొంత కాలం వేచి ఉందాం’ అని అన్నారు. కేంద్రంలో ఏర్పడే అస్థిర, బలహీన ప్రభుత్వం అధికారం కోల్పోతే తాను సంతోషిస్తానని వ్యాఖ్యానించారు.