Mamata Banerjee : కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన నిందితుడిని ఉరితీయాలని ఆమె పేర్కొన్నారు. తమ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలకు సంబంధించి అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించామని వెల్లడించారు.
ఎలాంటి సమాచారం, ఆధారాలను బహిర్గతం చేయలేదని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి తనతో పాటు, బెంగాల్ ప్రజల సానుభూతి ఉందని అన్నారు. ఇది చాలా పెద్ద నేరం, నిందితుడిని ఉరితీయడమే సరైన శిక్ష అని స్పష్టం చేశారు. దోషిని ఉరితీస్తేనే దాన్నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని చెప్పారు. అయితే ఏ ఒక్క అమాయకుడినీ శిక్షించరాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఇక కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనలో సత్వర విచారణ చేపట్టి నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యం జరగకుండా బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా వ్యవహరించాలని కోరుతున్నారు.
Read More :
Ganja oil | హైదరాబాద్లో రూ. 8లక్షల విలువైన గంజాయి అయిల్ పట్టివేత