Mamata Banerjee : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మమతా బెనర్జీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే కాషాయ నేతలు, కమ్యూనిస్టులపై టీఎంసీ అధినేత్రి విరుచుకుపడుతున్నారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
సీపీఎం, బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రిలోకి ప్రవేశించి అరాచకం సృష్టించారని తనకు తెలుసని చెప్పారు. సీపీఎం కార్యకర్తలు డీవైఎఫ్ఐ జెండాలతో, బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలు చేబూని అరాచకానికి తెగబడ్డారని వీడియోలో కనిపిస్తున్నదని అన్నారు. జాతీయ పతాకాన్ని దుర్వినియోగం చేసిన వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు.
మణిపూర్ భగ్గుమన్నప్పుడు బీజేపీ, సీపీఎంలు ఎన్ని బృందాలను అక్కడికి పంపాయని ఆమె ప్రశ్నించారు. హథ్రాస్, ఉన్నావ్‌కు ఎన్ని బృందాలను ఈ పార్టీలు పంపాయని దీదీ నిలదీశారు. మణిపూర్, యూపీల్లో అరాచకాలు జరిగినప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీపీఎం, బీజేపీ తనను బెదిరించలేవని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే తాము ఇక్కడ వరకూ వచ్చామని ఆమె పేర్కొన్నారు.
Read More :