న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మంగళవారం ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశం జరిగింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి గెలిస్తే, ఖర్గే మొట్టమొదటి దళిత ప్రధాని అవుతారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
దీనిపై ఖర్గే మాట్లాడుతూ, ‘అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నా. విపక్ష ఇండియా కూటమి గెలుపు సాధించటం ముఖ్యం. ప్రధాని ఎవరన్నది ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయిస్తారు’ అని అన్నారు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష ఇండియా కూటమి నేతలు సమావేశమవ్వటం ఇదే మొదటిసారి. సీట్ల సర్దుబాటుపై వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 100 శాతం వీవీప్యాట్లను లెక్కించాలి. ఈవీఎంలపై ఇండియా కూటమి పక్షాలు అనుమానాలు లేవనెత్తాయి. 100 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంపై ఈసీకి మెమొరాండం ఇచ్చినప్పటికీ సమాధానం లేదని పేర్కొన్నాయి.