Mamata Banerjee : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం పార్టీ పరంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఉనికికోసం ప్రయత్నిస్తున్నారు. తను పోటీ చేసిన భవానిపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడినుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, సీఎం సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేస్తూ మమత కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ మంగళవారం హైకోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ నేరుగా కోల్‌కతా హైకోర్టుకు హాజరవడం ఇది రెండోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భవానిపూర్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి మమతా బెనర్జీపై 15,105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంపై మమత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టీఎంసీలో కీలక మార్పులు చేసేందుకు మమత సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. టీఎంసీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్న సాయొని ఘోష్‌ను ఆ పదవి నుంచి మమత తప్పించారు. ఆమె స్థానంలో అర్నాబ్ బెనర్జీని నియమించారు. అలాగే, టీఎంసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కాళిగంజ్ ఎమ్మెల్యే అలిఫా అహ్మద్‌ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న ఎంపీ మాలా రాయ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు.
ఈ పదవుల నుంచి తొలగించిన సాయొని ఘోష్, మాలా రాయ్.. ఇద్దరూ రెబల్ గ్రూపులో చేరడమే ఇందుకు కారణం. టీఎంసీకి చెందిన సుదీప్ బంధ్యోపాధ్యాయ్ అనే ఎంపీ కూడా ఇప్పుడు రెబల్ గ్రూపులో చేరారు. దీంతో రెబల్ ఎంపీల సంఖ్య 20కి చేరింది. పార్టీకి 28 మంది ఎంపీలు ఉండగా, వారిలో 20 మంది తిరుగుబాటు గ్రూపులో చేరారు. వారు ఎన్సీపీఐ పార్టీలో తమను విలీనం చేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.