Mamata Banerjee : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 కు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని మండిపడ్డారు. అమిత్ షా, బీఎస్ఎఫ్ (BSF) కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని, బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారని వ్యాఖ్యానించారు.
హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మమత మండిపడ్డారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ.. అమిత్‌షాను నియంత్రించాలని సూచించారు. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు తమకు తెలిపాయని చెప్పారు.
అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్లో జరుగుతున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మమత ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. దీనిపై ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కోరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధానిని కోరారు.
హింసాకాండలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని సీఎం మమత ప్రకటించారు. ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆమె ఆదేశించారు. కాగా వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో హింస చెలరేగింది.