Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) ధీమా వ్యక్తంచేశారు. విజయం మామూలుగా ఉండబోదని మొత్తం స్థానాల్లో మూడింట రెండొంతుల స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇవాళ మమతా బెనర్జీ కోల్కతాలో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని చెప్పారు. మూడింట రెండొంతుల మెజారిటీ తమ పార్టీ సాధిస్తుందని అన్నారు. బీజేపీకి ఘోరం పరాజయం తప్పదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజయ చిహ్నం చూపిస్తూ వారిని ఉత్సాహపరిచారు.
అదేవిధంగా కేంద్ర బలగాలు, పరిశీలకులపై మమతాబెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, కేంద్ర పరిశీలకులు మహిళలు సహా అందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని, అమాయకులను కొడుతున్నారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలను కూడా వదలడం లేదని ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి ఘోరాలకు పాల్పడ్డారని అన్నారు. ఎంతోమంది టీఎంసీ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.