ముంబై, జూన్ 16: బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని విపక్ష టీఎంసీ పార్టీలో విభజన గురించి మర్చిపోకముందే దేశ రాజకీయాల్లో మరో ప్రతిపక్ష పార్టీలో తిరుగుబాటు చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)లో మరో చీలిక తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)కి బైబై చెప్పడానికి సిద్ధపడుతున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం మరో ఆరేడు రోజుల్లో ఈ తిరుగుబాటు సంపూర్ణ రూపం సంతరించుకుంటుందని అంటున్నారు. 2022లోనే ఈ పార్టీలో అతి పెద్ద తిరుగుబాటు చేసుకోవడంతో ఏకంగా పార్టీ పేరునే కోల్పోవాల్సి వచ్చింది.
‘ఆపరేషన్ టైగర్’ పేరుతో జరుగుతున్న ఈ రెబల్స్ తిరుగుబాటు ప్రకారం శివసేన (యూబీటీ) ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీలతో ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఠాక్రే పార్టీ ఎంపీలు పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై షిండే సేన ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీలు తమతో టచ్లో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
బెంగాల్లో టీఎంసీకి చేసినట్టే ఇక్కడ కూడా చేయవచ్చు కదా అని ఆయనన నిలదీశారు. తమ పార్టీ ఎంపీలందరూ తమతోనే ఉన్నారని, ఈ విషయాన్ని ఆదివారమే స్పష్టం చేశామని తెలిపారు. కాగా, ఇప్పటికే కొన్ని వారాల క్రితమే ఎంపీల పార్టీ మార్పుపై ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయని, పార్టీ మారడాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని శివసేన నేత ఒకరు తెలిపారు. ఠాక్రే ఎంపీలందరూ ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నారని మంత్రి, శివసేన నేత ప్రతాప్ జాదవ్ ప్రకటించారు.
పార్టీని విడిచిపెట్టి వెళ్లాలనుకుంటున్న వారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇటీవల పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన దృఢ వైఖరిని ప్రదర్శించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2022లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలో సంభవించిన చీలిక గురించి తనకు ముందే తెలిసినా, పార్టీలోనే కొనసాగమంటూ ఎవరినీ ఒత్తిడి చేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.