కోల్‌కతా, మార్చి 26: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. హిందూత్వ అజెండాతో 2026 ఎన్నికల బరిలోకి దిగి, ఎలాగైనా తొలిసారి బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న విపక్ష బీజేపీని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఆమె వ్యూహాల్లో సాఫ్ట్ హిందూత్వను స్వీకరించడం, బెంగాలీ గుర్తింపును ప్రోత్సహించడం, ముస్లిం, మహిళా ఓటర్లపై దృష్టి పెట్టడం, సర్ ప్రచారాన్ని సవాల్ చేయడం, టీఎంసీ పార్టీ బలమైన సంస్థాగత పునాదిని తమ విజయానికి బాటగా మార్చుకోవడం వంటివి ఉన్నాయి. 15 ఏండ్లుగా రాష్ర్టాన్ని అప్రతిహతంగా ఏలుతున్న ఆమెకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీయే ఎదురవుతున్నది. ఒకప్పుడు వామపక్ష ఆధిపత్యంతో కూడిన లౌకికవాదంతో ముడిపడిన బెంగాల్ రాజకీయాలు గత కొన్ని ఏండ్లుగా హిందూత్వ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాల నుంచి ఉద్భవించిన హిందూత్వ నినాదం ప్రస్తుతం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది.
తమ ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమానికి పాటుపడుతున్నదని, మతం ప్రాతిపదికగా సంక్షేమ పథకాల కేటాయింపులో ఎలాంటి వివక్ష చూపడం లేదని, తాను మానవత్వం, సోదరభావాన్ని నమ్ముతానని ఇటీవల మమతా బెనర్జీ ఒక సభలో పేర్కొన్నారు. కాగా, రాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వాడు కాదని, అతను అందరివాడని ఆమె శ్రీరామనవమిని పురస్కరించుకుని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీరామనవమి పండుగను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ నేత, మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న సువేందు అధికారి వ్యూహం పన్నారు.
ఈ మేరకు ఆయన తాను పోటీలో ఉన్న దక్షిణ కోల్‌కతా భవానీపూర్‌లో శ్రీరామనవమి ఊరేగింపునకు నేతృత్వం వహించారు. కాగా, ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ‘సర్’ ద్వారా ఓట్ల తొలగింపు తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ ఆశపడుతున్నది.
ఒక సీజనల్ రాజకీయ వేత్తగా మమతా బెనర్జీ కరుడుగట్టిన హిందూత్వ వాది కాదు. ఆమె బీజేపీలా కాకుండాసాఫ్ట్ హిందూత్వాన్ని అనుసరిస్తున్నారు. అయితే హిందూ ఓటర్ల మద్దతు లేకుండా తాను గెలవలేనన్న సంగతి ఆమెకు తెలుసు. దాంతో ఆమె వారిని ప్రసన్నం చేసుకునేందుకు బెంగాల్ శైవ- శాక్త సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా దుర్గా అంజన్ ప్రాజెక్ట్, జగన్నాథ్ ధామ్, బంగ్లా మాత టెంపుల్, మహాకాల్ టెంపుల్, గంగాసాగర్ మేళా లాంటి పలు ఆలయ ప్రాజెక్టులను చేపట్టారు. అంతేకాకుండా దుర్గా పూజా మండపాల కేటాయింపును పెంచారు. గత ఏడాదే ఆమె దుర్గా పూజా కమిటీలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ. 85 వేల నుంచి లక్షా 10 వేలకు పెంచారు. అదే సమయంలో బీజేపీ హిందూత్వ నినాదాన్ని బెంగాల్ అస్తిత్వ అజెండాతో ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ వారిని బెంగాల్ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు, జై శ్రీరామ్ నినాదాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆమె జై బంగ్లా, జై దుర్గా నినాదాలను ప్రోత్సహించడం ప్రారంభించారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉంటున్న బెంగాలీ వలసదారులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ కమలనాథులు బెంగాలీలను ద్వేషించే వారిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం ఉన్న ముస్లింలు మమత పార్టీకి పెద్ద ఓటు బ్యాంకే అని చెప్పవచ్చు. అలాగే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్‌లో తీవ్ర అక్రమాలు జరిగాయని, ముస్లిం ఓటర్ల తొలగింపు లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేసిందని ఆమె ఆరోపించింది.
కాగా, ఇప్పటికే రాష్ట్రంలో నగదు బదిలీ, గౌరవ భృతి లాంటి పథకాలతో మహిళలను ఆకట్టుకున్న మమత వారి ఓట్లపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీతో పోలిస్తే అధికార టీఎంసీకి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అత్యంత పటిష్ఠంగా ఉన్నది. అదే సమయంలో నగర, పట్టణ ప్రాంతాల్లో తన ముద్ర వేసిన బీజేపీ.. గ్రామీణ ప్రాంతాలకు చొచ్చుకుపోలేక పోయింది. అలాగే బీజేపీ నుంచి పటిష్టమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా ఉంది. ఏదిఏమైనా బీజేపీ అధికారంలోకి తెచ్చే ఏకైక అస్త్రం హిందుత్వ మాత్రమే. అయితే ఆ అస్త్రం ఈ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.