భోపాల్, నవంబర్ 11: మల్వా-నిమార్.. మధ్య ప్రదేశ్‌లోని 15 జిల్లాలతో 66 అసెంబ్లీ సీట్లున్న ప్రాంతం. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఇక్కడ తప్పక ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. అయితే ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఇప్పుడు అధికార బీజీపీ, విపక్ష కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో రెబల్స్ బెడద అధికంగా ఉంది. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. మొత్తం 66 సీట్లకు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ 35 సీట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక బీజేపీ అంతకుముందు ఎన్నికల్లో సాధించిన 57 సీట్ల నుంచి దిగజారి 28 సీట్లతోనే సరిపెట్టుకుంది.
ఈ ప్రాంతంపై తన పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్మూహాత్మకంగా వ్యవహరించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడోయాత్ర ఎంపీలో 380 కిలోమీటర్లు సాగగా, అందులో ఈ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ మొత్తం 114 సీట్లు గెల్చుకుందంటే అందులో 30 శాతం మల్వా-నిమార్ ప్రాంతానివే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా 2018లో ఈ ప్రాంతంలో భారీగా సీట్లు కోల్పోయిన బీజేపీ ఇప్పుడు తిరిగి అదే ఫీట్ పునరావృతం అవుతుందేమోనని భయపడుతున్నది.
మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో అతి ముఖ్యమైన మల్వా-నిమార్ ప్రాంతంలో ఇరు పార్టీలకు రెబల్స్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ వివిధ సీట్లలో పోటీలో ఉన్న రెబల్స్‌లో 12 మంది వరకు అభ్యర్థుల ఫలితాలను మార్చివేసే శక్తి ఉన్నవారు. ఇక కాంగ్రెస్‌ది కూడా ఇదే పరిస్థితి. బాద్నగర్, ఇండోర్ జిల్లాలోని మాహ్వ్, మాండసూరి జిల్లాలోని మల్హగర్తో పాటు అలట్, జవోరాతో పాటు పలు నియోజవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థుల బెడదను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాడ్లీ బహ్నా పథకం తమను ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందన్న ఆశతో బీజేపీ నాయకులు ఉన్నారు. కాగా, ఈ రీజియన్‌లో అత్యధిక ప్రాబల్యం చూపే గిరిజనులు 18 ఏండ్ల బీజేపీ పాలనలో దగాకు గురయ్యారని, వారంతా శివరాజ్ సింగ్‌ను గద్దె దింపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనుకుంటున్నట్టు ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.